ఒంటిగంట వరకు సగం మంది ఓటేసిండ్రు

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉ.1 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 49.52 శాతం పోలింగ్ నమోదైంది.

మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌లో ఉద్రిక్తతలు.. పలు జిల్లాల్లో ఘర్షణలు జరిగాయి.

కరీంనగర్ 28వ డివిజన్ లో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బులు పంచుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు తనిఖీలు చేపట్టడంతో జంపయ్య అనే వ్యక్తి వద్ద డబ్బుల కట్ట దొరికింది. సదరు వ్యక్తిని పట్టుకుని పోలీసులు వాహనంలోకి ఎక్కిస్తుంటే బీఆర్ ఎస్ ఎమ్మెల్యే గంగుల కమాలకర్ అడ్డగించి పోలీస్ వాహనం నుంచి బయటకు దించేశారు. పోలీసులతో వాగ్వాదం చేసుకున్నారు. కొంత మంది బీఆర్ ఎస్ కార్యకర్తలు కాసేపు ఆందోళన చేపట్టారు.

పెద్దపల్లి 29వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్, జనసేన నేతలు ఎన్నికల కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ASR నగర్‌లో గందరగోళం చోటుచేసుకుంది. 14వ వార్డులో పోలింగ్ కేంద్రంలో విద్యుత్ సరఫరా అంతరాయం కలగడంతో ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సిబ్బంది కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

వరంగల్ – వర్ధన్నపేట పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ నేతలకు పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ తోపులాటకు దిగారు.

ఆదిలాబాద్ రామ్‌నగర్ పోలింగ్ కేంద్రంలోకి కత్తితో వచ్చిన మహిళ కలకలం రేపింది. ఆమెను, ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నల్గొండ 32వ డివిజన్‌లో వేరే ప్రాంత వ్యక్తితో ఓటు వేయిస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. టూటౌన్ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన నేతను విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే కంచర్ల, బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డుపై బైఠాయించారు.

మెదక్ – రామాయపేట: 7వ వార్డులో బీజేపీ నాయకులు డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోగా పోలీసులు చెదరగొట్టారు.

నిజామాబాద్: 19వ డివిజన్ పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ, కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అనుచరుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనుచరులతో పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. ఇరువర్గాలను బయటకు పంపించారు.

రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతుండగా, ఉద్రిక్త ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *