కామారెడ్డి :
కామారెడ్డి జిల్లాలో డిగ్రీ కాలేజీ ఆస్తుల అంశం రాజకీయంగా వేడెక్కింది. ఈ విషయంపై అధికార పార్టీ, ప్రతిపక్ష నేతల మధ్య సవాళ్లు–ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి.
కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మరియు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోగా, కాంగ్రెస్–బీజేపీ నాయకుల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది.
ఈ నేపథ్యంలో కాలేజీ ఆస్తులపై తాను చర్చకు సిద్ధమని ప్రకటించిన ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు సాక్షాలతో రావాలని సవాల్ విసిరారు.
జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్ కాలేజ్ గ్రౌండ్ వద్దకు చేరుకున్న కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. మరోవైపు, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని క్యాంప్ ఆఫీస్‌లోనే హౌస్ అరెస్టు చేశారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నాయకుడు మహేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ వద్దకు వాహనంలో చేరి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు.
ఈ ఘటనలో మహేందర్ రెడ్డి వాహనాన్ని కొంతమంది బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేసినట్లు సమాచారం. క్యాంప్ ఆఫీస్ పరిసరాల్లో భారీ భద్రత మధ్య ఎమ్మెల్యే మరియు బీజేపీ నాయకులు లోపలే ఉన్నారు.

