ఏడీఏ ఇంట్లో ఏసీబీ దాడులు

నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీఏ)గా పనిచేస్తున్న సుందర్ కిరణ్ కుమార్ నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శనివారం ఉదయం ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు మహబూబ్‌నగర్ ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ వెల్లడించారు.

సుందర్ కిరణ్ కుమార్ స్వస్థలం అయిన పొనుగోడు గ్రామంలోని ఇంటితో పాటు ఆయన బంధువుల నివాసాల్లో కూడా ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. మొత్తం ఏడు ప్రాంతాల్లో సోదాలు కొనసాగినట్లు అధికారులు తెలిపారు. గడ్డిపల్లి గ్రామంలోని బంధువుల ఇల్లు, అనంతగిరి మండలం అమీనాబాద్, తుక్కుగూడ, నేరేడుచర్ల మండలం చిల్లపల్లి వద్ద ఉన్న రైస్ మిల్‌తో పాటు కల్వకుర్తిలోని ఇతర ఆస్తులపై దాడులు జరిగాయి.

సోదాల సందర్భంగా స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఆస్తుల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారని, పూర్తి సమాచారం దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని తెలిపారు.

కాగా, సుందర్ కిరణ్ కుమార్ గతంలో సూర్యాపేట జిల్లా డీఆర్‌డీఏలో పీడీగా పనిచేసిన సమయంలో కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నట్లు సమాచారం. రాజకీయ అండదండలతో పదవులు చేపట్టి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *