జనగామ :
జనగామ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ పరిధిలో ఉన్న రిజర్వాయర్లోకి ఒక కారు దూసుకెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ప్రమాదం చిల్పూరు మండలం దేశాయి తండా సమీపంలో చోటుచేసుకుంది.స్టేషన్ ఘనపూర్ నుంచి దేశాయి తండాకు వెళ్తున్న షిఫ్ట్ కారు అదుపుతప్పి పల్టీలు కొట్టి రిజర్వాయర్లో పడిపోయినట్లు సమాచారం. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
కారులో ఉన్న ధారావత్ చరణ్ (18) అద్దాలు పగలడంతో గాయాలతో బయటపడినట్లు తెలిసింది. ఆయనను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. అయితే కారు నడుపుతున్న భూక్య పవన్ ఆచూకీ ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు అధికారిక ప్రకటన వెలువరించాల్సి ఉంది.

