జ్వాల, హైదరాబాద్:
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) పాస్‌పోర్టుకు సంబంధించి అసత్య మరియు పాఠకులను తప్పుదోవ పట్టించే వార్తను ప్రచురించారంటూ ‘ప్రముఖ దినపత్రిక’ యాజమాన్యం, ఎడిటోరియల్ టీమ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసు పంపించారు. కేటీఆర్ తరఫు న్యాయవాది ఎన్. లలితారెడ్డి ప్రముఖ దినపత్రిక ఎడిటర్, పబ్లిషర్, ప్రింటర్, రెసిడెంట్ ఎడిటర్ మరియు సంబంధిత రిపోర్టర్‌కు సెప్టెంబర్ 30న ఈ నోటీసు జారీ చేశారు. సెప్టెంబర్ 29న ప్రచురితమైన ఆ కథనంలో వాస్తవాలు లేవని నోటీసులో పేర్కొన్నారు.
“ఏసీబీ దాఖలు చేసింది మెమో మాత్రమే.. ఉత్తర్వు కాదు”
వాస్తవానికి ఏసీబీ (ACB) దర్యాప్తు అధికారి ప్రత్యేక కోర్టులో కేటీఆర్ పాస్‌పోర్టుకు సంబంధించి తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మెమో మాత్రమే దాఖలు చేశారని నోటీసులో స్పష్టం చేశారు. కానీ, కోర్టు ఇప్పటికే పాస్‌పోర్టును తాత్కాలికంగా జప్తు చేయాలని ఉత్తర్వులు ఇచ్చేసినట్లు ప్రచురించడం పూర్తిగా తప్పుదోవ పట్టించడమేనని లలితారెడ్డి తెలిపారు. అంతేకాకుండా, రీజినల్ పాస్‌పోర్టు కార్యాలయం (RPO) సెప్టెంబర్ 28న పాస్‌పోర్టు చట్టంలోని సెక్షన్ 10(3)(e) కింద షోకాజ్ నోటీసు జారీ చేసి, వివరణ ఇచ్చేందుకు 15 రోజుల గడువు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ పరిణామాలను దాచిపెట్టి, కోర్టు ఉత్తర్వులని రాయడం కేటీఆర్ ప్రతిష్ఠను దిగజార్చే కుట్రలో భాగమేనని పేర్కొన్నారు.
