దేవరుప్పుల :
దేవరుప్పుల మండలంలోని కడవెండి శివారు వానకొండయ్య లక్ష్మీనరసింహ స్వామి కల్యాణం మంగళవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. శ్రీ వాన కొండయ్య లక్ష్మీనరసింహస్వామి తలంబ్రాలను కడవెండి గ్రామ సర్పంచ్ భాషిపాక రాములు ఆధ్వర్యంలో ,ఉప సర్పంచ్, వార్డు సభ్యుల గ్రామ ప్రజల సమక్షంలో, కడవెండి అభయాంజనేయ స్వామి గుడిలో పూజ చేశారు. గ్రామ సర్పంచ్, గ్రామ ప్రజలు అందరు కలిసి తలంబ్రాలను వాన కొండయ్య గుట్ట వరకు డప్పు చప్పులు, కోలాట బృందాలు, భజన కీర్తనలు, డోలు బృందాలతో, లంబాడి ఆట పాటలతో, వాన కొండయ్య గుట్ట వరకు చేరుకున్నారు. గుట్టపైకి సర్పంచ్ లు రాములు ,అనిత చందూలాల్ తలంబ్రాలను తీసుకొని గుట్ట పైకి మెట్ల ద్వారా చేరుకున్నారు.

ఉమ్మడి కడవెండి, మాదాపురం, ధర్మపురం, గ్రామ ప్రజల అందరి సమక్షంలో శ్రీ వాన కొండయ్య లక్ష్మీనరసింహస్వామి కళ్యాణము నలుగురు అయ్యగారుల సమక్షంలో కళ్యాణం మహోత్సవం బ్రహ్మాండంగా జరిగింది. ఉత్సవ నిర్వహణ కోసం పోటీ పడి మూడు కమిటీలు వేసిన సంగతి తెలిసిందే. అయినా అంతా కలిసే కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతర వద్ద పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.
శ్రీ వానకొండయ్య శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి కళ్యాణమహోత్సవంలో టీపీసీసీ సభ్యుడు డాక్టర్.లకావత్ లక్ష్మీ నారాయణ నాయక్ పాల్గొన్నారు.
ఏమిటా.. తలంబ్రాల వివాదం..?
కడవెండి గ్రామం నుంచే ఆనవాయితీగా తలంబ్రాలు తీసుకుని రావడం వస్తుంది. ఈ సారి కూడా సర్పంచి ఆధ్వర్యంలోనే తలంబ్రాలు తీసుకుని ఆంజనేయ స్వామి గుడి దగ్గర పూజలు చేసి తీసుకువచ్చారు. వీళ్లంతా నేరుగా అవి తీసుకుని గుట్టపైకి వెళ్లారు. ఎమ్మెల్యే ప్రకటించిన కమిటీ ఛైర్మన్ సైతం తలంబ్రాలను తీసుకురావడం.. వాటిని గుట్ట మెట్ల దగ్గర పూజలు చేసేందుకు సమాయత్తం కావడంతో గ్రామస్తులు వారించడంతో ఆ ప్రక్రియను నిలిపివేశారు. సర్పంచ్ తెచ్చిన వాటితోనే కల్యాణ కార్యక్రమం నిర్వహించారు.
