తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్

రాష్ట్రంలో రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం రైతు భరోసా నిధుల విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 22న తొలి విడత రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా నర్మెట్ట నుంచి విడుదల చేయనున్నారు. రైతు భరోసా నిధుల విడుదలకు సంబంధించిన ఏర్పాట్లపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఒక ఎకరం వరకు రైతు భరోసా కింద రూ.3,590 కోట్లను నేరుగా జమ చేయనున్నారు. రెండో విడతను సుమారు 20 రోజుల తర్వాత విడుదల చేస్తూ మరో రూ.2,650 కోట్లను రైతుల ఖాతాల్లోకి బదిలీ చేయనున్నారు.

మూడో విడతను ఏప్రిల్ నెలాఖరులోపు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడు విడతలుగా కలిపి రైతుల ఖాతాల్లోకి మొత్తం సుమారు రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు జమ కానున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఉపశమనం కలగనుందని ప్రభుత్వం భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *