కరీంనగర్ :
హోమోసెక్స్ పేరుతో మోసం చేసి దాడి చేసి డబ్బులు, మొబైల్ ఫోన్ దోచుకున్న నిందితులను కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. రమిల్లా కృష్ణమూర్తి (38), కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి. కొన్ని రోజుల క్రితం తన మొబైల్ ఫోన్‌లో “Grindr” అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని అందులో జాయిన్ అయ్యాడు. ఆ యాప్ ద్వారా గేలు , ట్రాన్స్‌జెండర్ లతో పరిచయం ఏర్పడింది. ఫోన్ చేసి హోమోసెక్స్ కోసం పిలిచేవారు.కొంత నగదు ఇచ్చి పంపించేవారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 13న ఉదయం జుమైర్ అనే వ్యక్తి తనతో హోమోసెక్స్ చేయాలని, అలాగే మసాజ్ చేయాలని చెప్పి డబ్బులు ఇస్తానని చెప్పాడు. ట్రైన్ ఎక్కి కరీంనగర్‌కు చేరుకున్నాడు.బైక్‌పై వచ్చి బొమ్మకల్ బైపాస్ రోడ్డులో ఉన్న ఓ ఫంక్షన్ హాల్ వెనుకకు తీసుకుపోయాడు. అంతలోనే మరో ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చి అతనిపై దాడి చేశారు. నీ దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించడంతో భయపడి బాధితుడు తన దగ్గర ఉన్న ఫోన్ తో పాటు రూ.1,500 నగదు ఇచ్చాడు.
డబ్బులు లేకపోవడంతో బాధితుడు బస్ స్టాండ్‌లో రాత్రి గడిపి మరుసటి రోజు కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన సీఐ ఏ. నిరంజన్ రెడ్డి, ఏసీపీ విజయ్ కుమార్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ రోజు ఉదయం తీగలగుట్టపల్లి రైల్వే స్టేషన్ వద్ద ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
నిందితులలో ఒక మైనర్ బాలుడు, A-1 సయ్యద్ అబ్బాస్ @ ఆర్బాస్ (సలేహనగర్ రేకుర్తి, ప్రస్తుతం కిసాన్ నగర్), A-2 మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ (కిసాన్ నగర్, ప్రస్తుతం సిటిజన్ కాలనీ, బొమ్మకల్) ఉన్నారు. వారి వద్ద నుండి బాధితుడి మొబైల్ ఫోన్, రూ.1,500 నగదు, మరో మూడు మొబైల్ ఫోన్లు మరియు నేరానికి ఉపయోగించిన రెండు బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను కోర్టులో రిమాండ్‌కు పంపించారు.
ఇలాంటి యాప్‌ల ద్వారా ఇతరులను మోసం చేయడం లేదా అసభ్య సమాచారాన్ని పంచుకోవడం చట్టరీత్యా నేరమని, అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
