ముగిసిన సమ్మక్క–సారలమ్మ మహా జాతర
మేడారం:
వన దేవతలు శ్రీ సమ్మక్క–సారలమ్మలు తిరిగి వనప్రవేశం చేయడంతో మేడారం మహా జాతర ఘనంగా ముగిసింది. నాలుగు రోజుల పాటు మేడారం భక్తజనంతో కిటకిటలాడి, ఉత్సవ వాతావరణంతో మెరిసింది. శాశ్వత నిర్మాణాలు, మెరుగైన ఏర్పాట్లతో ఈ ఏడాది జాతర కొత్త చరిత్రను లిఖించింది.
వనం నుంచి గద్దెలపైకి విచ్చేసిన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు తిరిగి వనప్రవేశం చేసిన క్షణం భక్తి, భావోద్వేగాల సంగమంగా నిలిచింది. నాలుగు రోజులుగా లక్షలాది భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేసి, బెల్లం రూపంలో బంగారం, మొక్కులు సమర్పించారు. గిరిజన సంస్కృతిని ప్రతిబింబించిన ఆచారాలు, కట్టడాలు ప్రతి ఒక్కరినీ ఆధ్యాత్మిక భావంలో ముంచెత్తాయి.
జాతర నిర్వహణలో అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడంతో ఉత్సవం ప్రశాంతంగా ముగిసింది. తెలంగాణ ప్రజా ప్రభుత్వం జాతరను వైభవంగా నిర్వహించాలన్న సంకల్పం కార్యరూపం దాల్చిందని నిర్వాహకులు తెలిపారు. శ్రీ సమ్మక్క–సారలమ్మ ఆశీర్వాదంతో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్ష వ్యక్తమైంది.

