జనగామ :
జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు గుర్తించడంతో స్థానికంగా భయాందోళన నెలకొంది. దేవరుప్పుల మండలం సీతరంపురం గ్రామ సరిహద్దుల్లో పెద్దపులి కదలికలను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో దేవరుప్పుల మండలం సీతారంపురంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో దండోరా చాటింపు వేయించి ప్రజలను, రైతులను అధికారులు అప్రమత్తం చేశారు. పెద్దపులి జనగామ వైపు నుంచి సంచరిస్తూ వచ్చినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
పెద్దపులి సంచారం నేపథ్యంలో దేవరుప్పుల మండలంలోని గ్రామాల ప్రజలు, రైతులను హై అలెర్ట్‌లో ఉంచినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ముఖ్యంగా పొలాలకు ఒంటరిగా వెళ్లవద్దని, రాత్రి వేళల్లో బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇదిలా ఉండగా.. లింగాల ఘనపురం మండలం కుందారంలోనూ పెద్ద పులి పాద ముద్రలను సైతం ఫారెస్టు అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తుంది. ఇదే పులి అక్కడికి వెళ్లిందా..? లేదా మరొక పులి అక్కడ సంచరిస్తుందా.. ? అసలు పులి ఒకటా.. రెండా అనే గందరగోళం నెలకొంది. గత కొద్ది రోజులుగా ఫారెస్టు అధికారులకు మాత్రం నిద్ర ఉండటం లేదు. అదిగో పులి.. ఇదిగో పులి వార్తలు వస్తుండటంతో వాళ్లే రంగంలోకి దిగి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఫారెస్టు ఉన్నతాధికారులు చొరవ తీసుకుని పులి కథ ముగింపు పలకాలని.. గ్రామాల్లో నిద్రలేని రాత్రులు గడుపుతున్నాయని ప్రజలు వాపోతున్నారు.


Update